డబుల్ సెంచరీలు అనేవి టెస్ట్ మ్యాచ్ లలో మనకు బాగా వినపడేవి. వన్డేలలో సెంచురీ చేయడమే గగనం అని చెప్పుకునే రోజుల్లోనే కొంతమంది ఎంతో చెమటోడ్చి ద్విశతకానికి దగ్గరకు వచ్చినప్పటికీ చేరుకోలేకపోయారు. దాదాపు వన్డేలలో  అసాధ్యంగా వున్న ద్విశతకాన్ని క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి సచిన్ సాధించి నిజంగానే రికార్డులు అంటే తనకు ఎంత మక్కువో మరోసారి తెలియజేసాడు.  సచిన్ ని  వెంబడిస్తూ మరికొంతమంది ఆటగాళ్లు తమ నైపుణ్యంతో డబల్ హండ్రెడ్ కొట్టి క్రికెట్ అభిమానుల హృదయాల్లో నిలిచారు. అందులో రోహితశర్మలాంటివారు మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా మూడు డబల్ సెంచరీలు చేసి డబుల్ సెంచరీలు చేయడం అంటే తనకెంత తేలికో ప్రపంచానికి చాటిచెప్పాడు. 

అంతర్జాతీయ వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలు కొట్టిన మొనగాళ్లు :

1. సచిన్ తెందూల్కర్ (ఇండియా)-200 vs సౌత్ ఆఫ్రికా 

Image
సచిన్ తెందూల్కర్ క్రికెట్ రికార్డులలో అనేక రికార్డులను తిరగరాసిన రారాజు అని మనందరికీ తెలుసు. కానీ ఎవరు ఊహించని విధంగా  అంతర్జాతీయ వన్డేలలో దశాబ్దాలుగా  ఎవరు సాధించలేని డబుల్ సెంచరీని సాధించాడు.  పిభ్రవరి, 2010 వ సంవత్సరంలో గ్వాలియర్ లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా కు  సెహ్వాగ్ రూపంలో మొదటి వికెట్ పడింది. దీంతో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ తో సచిన్ 194 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పుతాడు. దాని తరువాత 90 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న సచిన్, తన చూడముచ్చటైన షాట్లతో బలమైన బౌలింగ్ లైనప్ వున్న సౌత్ ఆఫ్రికాను  ఒక ఆట ఆడుకుని తరువాతి 100 పరుగులు 57 బంతుల్లోనే  చేస్తాడు. మొత్తంమీద 147 బంతుల్లోనే 25 ఫోర్లు, 3సిక్సులతో 200 పరుగులకు నాట్ ఔట్ గా నిలిచి విధ్వంసకర  బ్యాట్సమన్స్ చేయలేని దానిని సచిన్ చేసి తనను క్రికెట్ దేవుడు అని ఎందుకు పిలుస్తారో నిరూపించాడు.  

2. వీరేంద్ర సెహ్వాగ్ (ఇండియా)-219 vs వెస్ట్ ఇండీస్ 

Image may contain: one or more people, people standing, crowd, text and outdoor
వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్లో డేర్ & డాషింగ్ బ్యాట్సమన్. తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో మొదటి బంతినుంచే బౌండరీలు బాది బౌలర్లను బెంబేలెత్తిపోయేలా చేస్తాడు. 2011 వ సంవత్సరం డిసెంబర్లో వెస్ట్ ఇండీస్ తో జరిగిన వన్డేలో కెప్టెన్ గా వున్న సెహ్వాగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని గంభీర్ తో కలిసి మొదటి వికెట్కు 176 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి శుభారంభాన్ని అందిస్తాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుని కేవలం 149 బంతుల్లోనే 25 ఫోర్లు, 7 సిక్సులతో 219 పరుగులు చేసి వన్డేలలో డబుల్ సెంచురీ చేసిన మొదటి కెప్టెన్ గాను రెండవ  ఆటగాడిగాను చరిత్రలో నిలిచిపోయాడు. ఈ మ్యాచులో వెస్ట్ ఇండీస్ బౌలర్లలో ఏ ఒక్కడి ఎకానమీ 7 పరుగులకు తగ్గలేదంటే సెహ్వాగ్ ఏ విధంగా వెస్ట్ ఇండీస్ బౌలర్లతో చెడుగుడు ఆడాడో మనం అర్థం చేసుకోగలము. అలాగే టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ, వన్డేల్లో డబల్ సెంచరీ చేసిన ఇద్దరి బ్యాట్సమన్లలో ఒకడిగా నిలిచాడు.   

3. రోహిత్ శర్మ(ఇండియా)-209 vs ఆస్ట్రేలియా

Image
రోహిత్ శర్మ 2013 లో ఓపెనర్ గా మారిన తరువాత తన ఆటతీరులో ఎంతో  మార్పు కలిగింది. వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు చేసి అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డును నిలిపాడు. రోహిత్ శర్మ తన మొదటి  డబుల్ సెంచరీని 2013 సంవత్సరంలో ఆస్ట్రేలియామీద చేసాడు ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీన్నే అదునుగా తీసుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లి పోయేలా 158 బంతుల్లో 12 ఫోర్లు,16 సిక్సర్లతో 209 పరుగులు చేసి డబుల్ సెంచరీ చేసిన మూడవ ఆటగాడిగాను అప్పటికి ఒక వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టినవాడిగాను నిలిచాడు. రోహిత్ శర్మ, ధోని విజృంభణతో చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 101 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లు కలలోకూడా  మరిచిపోనివిధంగా దుమ్ములేపాడు.  

4. రోహిత్ శర్మ (ఇండియా)-264 vs శ్రీలంక 

Imageరోహిత్ శర్మ 2014  నవంబర్ 13 న భారతదేశంలోనే పెద్ద స్టేడియం అయిన ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో వన్డే క్రికెట్లో ఎవరు ఉహించనిరీతిలో సరికొత్త రికార్డు నెలకొల్పబడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు ఓపెనింగ్ చేసిన రోహిత్ మ్యాచ్ ఆసాంతం బంతిని బౌండరీకి పరిగెత్తిస్తూ  ఏకంగా 173 బంతుల్లో 33 ఫోర్లు, 9సిక్సులతో  264 పరుగులు చేసి అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలోనే 250 కంటే అధిక పరుగులు చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రత్యేకత ఏంటంటే రోహిత్ శర్మ వన్డేలలో  అత్యధిక పరుగులు చేయడం మాత్రమే కాక శ్రీలంక జట్టు చేసిన మొత్తం పరుగులయిన 251 కంటే రోహిత్ శర్మ ఒక్కడి పరుగులే ఎక్కువగా ఉండడం. అలాగే వన్డేలలో ఒక ఇన్నింగ్సులో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్రపుటల్లోకెక్కాడు.    

5. క్రిస్ గేల్ (వెస్ట్ ఇండీస్)-215 vs జింబాబ్వే 

Image
క్రిస్ గేల్ వెస్ట్ ఇండీస్ విధ్వంసకర ఆటగాడు. టీ20 లలోనే గొప్ప ఆటగాడు. ఇతడు వన్డేలలో డబుల్ సెంచరీ చేయగల సత్తా వున్న వారిలో ఒకరు అని అంటూ ఉండేవారు. కానీ ఆ మాట నిజం చేయడానికి ఎంతో సమయం పట్టలేదు. 2015 వరల్డ్ కప్ లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో కేవలం 138 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ కు ఓపెనర్ క్రిస్ గేల్  కేవలం 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సులతో 215 పరుగులు చేసి మొదటిసారిగా వరల్డ్ కప్ లో డబుల్ సెంచరి కొట్టినవాడుగాను వెస్ట్ ఇండీస్ తరుపున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసినవాడిగాను నిలిచాడు.

6. మార్టిన్ గప్తిల్(న్యూజిలాండ్)- 237 vs వెస్ట్ ఇండీస్

Image
ఈ న్యూజిలాండ్ బ్యాట్సమెన్ వన్డే చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసినవారిలో 237 పరుగులతో 2వ స్థానంలో నిలిచాడు. 2015 వ సంవత్సరంలో వరల్డ్ కప్ క్వార్టర్ పైనల్ లో వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 163 బంతుల్లో 237 పరుగులు చేసి క్రికెట్ అభిమానులను అబ్బురపరిచాడు. న్యూజిలాండ్ తరుపున ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన పేరట వున్న రికార్డును తానే తిరగరాశాడు. అలాగే వన్డేలలో డబుల్ సెంచరీ చేసిన వారిలో ఐదవ ఆటగాడిగా నిలిచాడు. 

7. రోహిత్ శర్మ (ఇండియా)- 208 vs శ్రీలంక 

Image
ఇది రోహిత్ శర్మ కెరియర్లో మూడవ డబుల్ సెంచరీ. 2017 లో శ్రీలంక పైన జరిగిన మ్యాచ్లో ఏకంగా 153 బంతుల్లో 208 పరుగులు కొట్టి  మెరుపులాంటి ఇన్నింగ్స్ ఆడి శ్రీలంకమీద తన రెండవ డబుల్ సెంచురీ చేసి ఒక దేశంమీద రెండు డబుల్ సెంచురీలు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. 

8. ఫకర్ జమాన్ (పాకిస్థాన్)- 210 vs జింబాబ్వే

Image
ఫకర్ జమాన్ వన్డేలలో డబుల్ సెంచురి చేసిన ఆరవ ఆటగాడు. ఇతడు 2018 లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో తన అగ్రెసివ్ బ్యాటింగుతో పాకిస్థాన్ తరుపున డబుల్ సెంచురీ మొదటి ఆటగాడిగా నిలిచాడు. టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఓపెనర్గా వచ్చిన ఇమామ్ ఉల్ హాక్ తన స్లో అండ్ స్టెడీ ఇన్నింగ్సుతో సెంచరీ చేసి అవుట్ కాగా మరో ఓపెనర్ ఫకర్ జమాన్ మాత్రం ఆరంభం నుంచే తన దూకుడైన ఆటతీరుతో  జింబాబ్వే బౌలర్లను చీల్చి చెండాడాడు. కేవలం 156 బంతుల్లోనే 24 ఫోర్లు, 5సిక్సులతో 210 పరుగులు చేసి వన్డేలలోనే ఒక వినూతన రికార్డు నెలకొల్పాడు. దీంతో పాకిస్థాన్ 50 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 399 పరుగులు చేయగలిగింది. జింబాబ్వే 400 పరుగుల లక్ష్యం చేధించే క్రమంలో 155 పరుగులకే కుప్పకూలడంతో 244 పరుగుల భారీ విజయం సాధించడంలో డబుల్ సెంచరీ చేసి కీలకపాత్ర పోషించిన ఫకర్ జమాన్ కు మాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.    

ధన్యవాదాలు 
కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.