వన్డేలలో అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పినవారి టాప్ 10 జాబితా, highest partnerships for any wicket in oneday international cricket

భాగస్వామ్యాలు అనేవి క్రికెట్లోని ఏ ఫార్మాట్లో అయినా చాలా ముఖ్యమైనవి. భాగస్వామ్యాన్ని నెలకొల్పే  ఇద్దరు బ్యాట్సమన్లు వికెట్ కాపాడుకుంటూ ఓపికతో పరుగులు చేస్తూ భారీ పరుగులకు పునాది వేస్తూ చివరి ఓవర్లలో తమ బ్యాట్ జుళిపిస్తూ వుంటారుఇది మంచి భాగస్వామ్య లక్షణం. మొదట బ్యాటింగ్ చేసేవారు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించాలన్నా, ప్రత్యర్థులు నిర్దేశించిన  భారీ లక్ష్యాన్ని చేధించాలన్నా భాగస్వామ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రతి మ్యాచులోను భాగస్వామ్యాలు నమోదవుతూనే ఉంటాయి కానీ అన్ని  భాగస్వామ్యాలు చరిత్రలో నిలిచిపోవు.  వన్డే క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పినవారి టాప్ 10 జాబితాను మనం పరిశీలిద్దాము. 


Gayle, Samuels recalled for England ODIs
highest partnership in ODI's 

వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పినవారి టాప్ 10 జాబితా  


1. క్రిస్ గేల్, మార్లొన్ శామ్యూల్స్ (వెస్ట్ ఇండీస్) 372 పరుగులు vs జింబాబ్వే, 2015 


2015 వరల్డ్ కప్ లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన మొదటి ఓవర్ రెండవ బంతికే డ్వైన్ స్మిత్ ఔటవ్వడంతో ఓపెనర్ గా ఉన్న క్రిస్ గేల్ కు భాగస్వామిగా మార్లన్ శామ్యూల్స్ క్రీజులోకి వస్తాడు. వీరిద్దరు  నిదానంగా సింగిల్స్ తో స్కోర్ బోర్డు నడిపిస్తూ తమ భాగస్వామ్యానికి పునాదులు వేస్తారు. ఇన్నింగ్స్ అన్ని ఓవర్లు వీరిద్దరే ఆడి 372 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జింబాబ్వే బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించి వన్డేలలోనే అత్యధిక భాగస్వామ్యాన్ని తమ పేరట రాసుకున్నారు. ముఖ్యంగా చివరి పది ఓవర్లలో వీరిద్దరు 152 పరుగులు పిండుకున్నారు. మ్యాచులో క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ డబల్ సెంచురీ చేసిన వాడిగాను, వరల్డ్ కప్లో మొదటి డబుల్  సెంచురీ చేసిన వాడుగాను రికార్డు సాధించాడు. వీరి భాగస్వామ్యంలో గేల్ 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సులతో 215 పరుగులు చేసి చివరి బంతికి ఔట్ కాగా మార్లన్ శ్యామ్యూల్స్ 156 బంతుల్లో 11 ఫోర్లు, 3సిక్సులకు 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ భాగస్వామ్యం వన్డేలలోనే అత్యుత్తమమైనదిగా నిలిచి మొదటి స్థానంలో ఉంది. 

2. కాంప్ బెల్, షాయ్ హోప్ (వెస్ట్ ఇండీస్) 365 పరుగులు vs ఐర్లాండ్, 2019


2019 మే 5 వెస్ట్ ఇండీస్ vs ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్లుగా వచ్చిన కాంప్ బెల్, నిలకడకు మారుపేరైన  షాయ్ హోప్ లు మొదటి ఓవర్ నుంచి ఐర్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా తమ ఆటకు భిన్నంగా ఆడుతూ అడపాదడపా బౌండరీలు బాదుతూ మొదటి వికెట్కుగాను 365 పరుగులు చేసి వన్డేలలో మొదటి వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి  ప్రపంచ రికార్డు సృష్టించారు. మ్యాచులో కాంప్ బెల్ 137 బంతుల్లో 15 ఫోర్లు, 6సిక్సులకు 179 పరుగులతో తన మొదటి సెంచరీనే భారీగా మలిచాడు. షాయ్ హోప్ 152 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి 170 పరుగులు చేసాడు. వన్డేలలో వికెట్ భాగస్వామ్యానికైనా ఇది రెండవ స్థానంలో వుంది. 


3.సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్(ఇండియా) 331 పరుగులు vs  న్యూజిలాండ్,1999


అంతర్జాతీయ మ్యాచులలో భాగస్వామ్యాలు నెలకొల్పాలంటే వీరిని మించిన ఆటగాళ్లు వెతికినా కనపడకపోవచ్చు. టెస్టుల్లోను వన్డేల్లోనూ తమ భాగస్వామ్యాలతో ఎన్నో మరుపురాని విజయాలు అందించారు. 1999 సంవత్సరం హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో గంగూలీ ఔట్ అవ్వడంతో ఓపెనర్ గా వున్న సచిన్ టెండూల్కర్ కు భాగస్వామిగా రాహుల్ ద్రావిడ్ క్రీజులోకి వస్తాడు. వీరిద్దరూ కలిసి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించి 331 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి వారెందుకు ప్రపంచ క్రికెట్లో గొప్ప ఆటగాళ్ళో మరోసారి నిరూపించారు. రాహుల్ ద్రావిడ్ 153 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులతో 153 పరుగులు చేసి ఔట్ అవ్వగా, సచిన్ కేవలం 150 బంతుల్లో 20 ఫోర్లు, 3సిక్సులతో  186 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్ల నడ్డి విరిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచులో సచిన్ టెండూల్కర్ కి  మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వన్డేలలో  వికెట్     భాగస్వామ్యానికైనా  ఇది మూడవ స్థానంలో వుంది.

4. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ (ఇండియా) 318 పరుగులు vs శ్రీలంక, 1999


భారత్ తరుపున ఆడిన గొప్ప ఆటగాళ్ల పట్టికలో గంగూలీ, ద్రావిడ్ ముందువరసలో వుంటారు అనేది జగమెరిగిన సత్యం. వీరిద్దరూ తమ ఆటతీరుతో భారతదేశాన్ని క్రికెట్లో ఉన్నత శిఖరాలలో నిలిపిన విషయం తెలిసిందే. వీరిరువురు 1999 వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచులో రెండవ వికెట్ కు 318 పరుగుల  భాగస్వామ్యాన్ని నెలకొల్పి శ్రీలంక బౌలర్లకు సింహస్వప్నంగా మారారు. మ్యాచులో గంగూలీ 158 బంతుల్లో 17 ఫోర్లు, 7సిక్సర్లతో 183 పరుగులు చేసి తన వన్డే కెరియర్లో అత్యధిక వన్డే స్కోర్ నమోదు చేయగా, రాహుల్ ద్రావిడ్ తన శైలికి భిన్నంగా ఆడి కేవలం 129 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్ తో 145 పరుగులు చేసి నిదానంగా ఆడుతాడని తనమీద  వస్తున్న విమర్శలు తిప్పికొట్టాడు. భాగస్వామ్యం  అత్యధిక వన్డే భాగస్వామ్యాలలో నాల్గవ స్థానంలో నిలిచింది. 

5. ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్ (పాకిస్థాన్) 304 పరుగులు vs జింబాబ్వే, 2018


యంగ్ అండ్ ఎనెర్జటిక్ ఓపెనర్స్ పాకిస్థాన్ కు మంచి ఆరంభాలిస్తూ  తమదైన సమయాన బౌలర్లమీద విరుచుకుపడుతూ వుంటారు. 2018 సంవత్సరం జింబాబ్వేతో జరిగిన నాల్గవ వన్డేలో పసికూన అయినా జింబాబ్వే మీద విరుచుకుపడి మొదటి వికెట్ కు 304 పరుగులు చేసి తమ జోడి ఎంత ప్రమాదకరమైనదో ప్రపంచానికి తెలియజేసారు. మ్యాచులో ఇమామ్ ఉల్ హాక్ తనదైన శైలిలో సెంచురీతో కదం తొక్కగా ఫఖర్ జమాన్ మాత్రం జింబాబ్వే బౌలర్లతో చెడుగుడు ఆడుకుని డబుల్ సెంచురీ చేసి పాకిస్థాన్ తరుపున డబల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగాను ఓవరాల్ గా 6 ఆటగాడిగా నిలిచాడు. జమాన్ కేవలం 156 బంతుల్లో 24 ఫోర్లు, 5సిక్సర్లతో  210 పరుగులు చేసి తమ జట్టు 244 తేడాతో విజయం సాధించడంలోముఖ్యమైన పాత్ర పోషించాడు.  

6. తమీమ్ ఇక్బల్ , లిటన్ దాస్(బంగ్లాదేశ్) 292 vs జింబాబ్వే, 2020 


2020 మార్చి నెలలో బంగ్లాదేశ్, జింబాబ్వేతో జరిగిన మ్యాచులో  వర్షం కారణంగా మ్యాచు 43 ఓవర్లకు కుదించగా ఓపెనర్లుగా వచ్చిన తమీమ్ ఇక్బల్, యువ ఆటగాడు లిటన్ దాస్ జింబాబ్వే  బౌలర్లను ఆడుకుంటూ ఏకంగా 245 బంతుల్లో 292 పరుగుల చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. భాగస్వామ్యం బంగ్లాదేశ్ తరుపున వికెట్కు అయినా అత్యధికమైన భాగస్వామ్యం. మ్యాచులో తమీమ్ ఇక్బల్ 109 బంతుల్లో 7ఫోర్లు, 6సిక్సులకు 128 పరుగులతో నాట్ ఔట్ గా నిలువగా, లిటన్ దాస్ మాత్రం రెచ్చిపోయి తన విధ్వంసకర ఆటను బయటికి తీసి కేవలం 143 బంతుల్లో 8సిక్సర్లు, 16 ఫోర్లతో 176 పరుగులు చేసి బంగ్లాదేశ్ తరుపున వన్డేల్లో ఒ ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్ చేసినవాడుగా నిలిచి అంతకుముందు తమీమ్ పేరిట వున్నరికార్డును తన పేరిట వ్రాసుకున్నాడు. ఇదే వన్డే  బంగ్లాదేశ్ విజయవంత కెప్టెన్ అయిన మష్రఫే మోర్తజాకు  చివరి వన్డే  కావడం విశేషం. వారి భారీ భాగస్వామ్యంతో తమ ప్రియ కెప్టెన్ కు గొప్ప వీడ్కోలు పలికారు అని చెప్పవచ్చు.  భాగస్వామ్యం అత్యధిక వన్డే భాగస్వామ్యాలలో ఆరవ స్థానంలో నిలిచింది.

7. ఉపుల్ తరంగ, సనత్ జయసూర్య (శ్రీలంక) 286 vs ఇంగ్లాండ్, 2006 


ఉపుల్ తరంగ స్లో అండ్ స్టడీసనత్ జయసూర్య తుఫాన్.  వీరిద్దరూ 2006 లో ఇంగ్లాండ్ తో లీడ్స్ లో  జరిగిన మ్యాచులో ఇంగ్లాండ్ నిర్దేశించిన  322 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లను తరంగ ఆచితూచి ఆడుతుంటే, జయసూర్య తన సుడిగాలి ఇన్నింగ్స్ తో మరోసారి ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి మొదటి వికెట్కు 286 పరుగులు చేసి 322 పరుగులను కేవలం 37.3 ఓవర్లలోనే చేధించడానికి తమవంతు పాత్రగా  ముందుండి నడిపించారు. మ్యాచులో తరంగ 102 బంతుల్లో 109 పరుగులు చేసి ఔట్ కాగా, సనత్ జయసూర్య కేవలం 99 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో152 పరుగులతో సోలంకి బౌలింగులో పెవిలియన్ చేరాడు.  భాగస్వామ్యం అత్యధిక వన్డే భాగస్వామ్యాలలో ఏడవ స్థానంలో నిలిచింది.

8. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) 284 vs పాకిస్థాన్, 2017


2017 పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లుగా వచ్చిన డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ మంచి శుభారంభాన్ని ఇచ్చి 284 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో  భారీ పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించడానికి దోహదపడ్డారు. ట్రావిస్ హెడ్ ఆచితూచి ఆడుతూ 128 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ కేవలం 128 బంతుల్లో 19 ఫోర్లు, 5సిక్సులకు 179 పరుగులు చేసి పాకిస్థాన్ బౌలర్లకు తన విశ్వరూపాన్ని చూపాడని చెప్పవచ్చు. మ్యాచులో పాకిస్థాన్ 370 పరుగుల లక్ష్య ఛేదనలో  57 పరుగులు తేడాతో ఓడిపొయ్యారు.  భాగస్వామ్యం వన్డేల్లో ఆస్ట్రేలియాకు వికెట్కు అయినా అతి పెద్ద భాగస్వామ్యం. అయితే  అత్యధిక వన్డే భాగస్వామ్యాలలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. 

9. క్వింటన్ డీ కాక్, హషీమ్ ఆమ్లా( సౌత్ ఆఫ్రికా), 282  vs బంగ్లాదేశ్, 2017


2017 సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచులో టాస్ గెలిచిన  బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫె మోర్తజా బ్యాటింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు ముష్పిఖర్ రహీమ్ సెంచరీతో కదంతొక్కగా 278 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందు ఉంచారు. 279 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనింగ్ కు వచ్చిన హషీమ్ ఆమ్లా, క్వింటన్ డీకాక్ బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా లక్ష్యాన్ని 42.5 ఓవర్లలోనే చేధించి ఇద్దరు 282 భాగస్వామ్యంతో నాట్ ఔట్ గా నిలిచారు. హషీమ్ ఆమ్లా తనదైన రీతిలో కట్టుదిట్టమైన బ్యాటింగ్ తో 112 బంతుల్లో 8 ఫోర్లతో 110 పరుగులు చేయగాక్వింటన్ డీకాక్ తన అగ్రసివ్ బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ బౌలర్లను చీల్చి  చెండాడి  145 బంతుల్లోనే 21 ఫోర్లు, 2సిక్సులతో 168 పరుగులు చేసాడు. వన్డేల్లో సౌత్ ఆఫ్రికా తరుపున చేసిన అత్యధిక భాగస్వామ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. 

10. ఉపుల్ తరంగ, దిల్షాన్(శ్రీలంక) 282 పరుగులు vs జింబాబ్వే 2011, వరల్డ్ కప్ 


2011 వరల్డ్ కప్ లో శ్రీలంక జింబాబ్వే మధ్య జరిగిన లీగ్ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు దిల్షాన్, తరంగ సెంచురీలు చేసి పరుగుల మోత మోగించి మొదటి వికెట్కు 282 పరుగులు జోడించి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి సెంచరీలతో శ్రీలంక 327 పరుగులు చేసింది. ఇందులో తరంగ 141 బంతుల్లో 17 ఫోర్లతో 133 పరుగులు చేయగా, దిల్షాన్ 131 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 144 పరుగులతో పాటు నాలుగు వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. అత్యధిక వన్డే భాగస్వామ్యాలలో పదవ స్థానంలో నిలిచింది.

ధన్యవాదాలు 
మీ అభిప్రాయాలూ కామెంట్ల రూపంలో తెలియజేయగలరు 


Post a Comment

0 Comments