Best bowling Figures in Ondeday cricket, వన్డే క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ బౌలింగు ఫిగర్స్

అంతర్జాతీయ క్రికెట్లో ఒక జట్టు విజయం సాధించాలంటే బ్యాట్సమన్లు, ఫీల్డర్లతోపాటు బౌలర్ల ప్రదర్శన చాలా ముఖ్యమైనది. అయితే కొంతమంది బౌలర్లు తమదైన రోజున చెలరేగి ఆడుతూ ఉంటే మేటి బౌలర్లుమాత్రం  తరచుగా రెచ్చిపోయి వికెట్లు తీస్తూ విజయాలలో ప్రధానపాత్ర పోషిస్తూ వుంటారు. ఈ విధంగా తమ అత్యుత్తమమైన ప్రదర్శనతో వికెట్లు తీస్తూ వన్డేలలో ఒక ఇన్నింగ్సులో అధిక వికెట్లు తీసి టాప్ 10 లో నిలిచిన వారి వివరాలు చూద్దాము. 


10. ఆకిబ్ జావేద్(పాకిస్థాన్) 7/37


జావేద్ 1992 లో వరల్డ్ కప్ గెలిచిన పాకిస్థాన్ జట్టు సభ్యుడు. ఇతడు మంచి నైపుణ్యంగల ఫాస్ట్ బౌలర్. వసీం అక్రమ్, వకార్ యూనిస్ ల వలన ఇతడి ప్రదర్శన మరుగు చేయబడింది అని చెప్పవచ్చు. 1991 వ సంవత్సరం ఇండియా పాకిస్థాన్ కు జరిగిన మ్యాచులో టాస్ ఓడిన పాకిస్థాన్ బ్యాటింగ్ చేసి 262 పరుగులు చేయగలిగింది. పాకిస్థాన్కు జాహిద్ ఫజల్ 98, సలీం మాలిక్ 87 పరుగులతో రాణించారు. 263 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇండియాకు ఆరంభంనుంచే అడ్డుకట్ట వేసి 190 పరుగులకే అవుట్ చెయ్యడంలో ఆకిబ్ జావేద్ కీలక పాత్ర పోషించాడు. ఇందులో ఆకిబ్ జావేద్ 10 ఓవర్లు వేసి ఒక మేడిన్తో 37 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు.  

9. వకార్ యూనిస్(పాకిస్థాన్) 7/36 


వకార్ యూనిస్ పాకిస్థాన్ లెజెండరీ బౌలర్. తన ఖచ్చితమైన యార్కర్ బంతులతో మేటి బ్యాట్సమన్లను కూడా వణికించాడు. ఇతడు బౌలింగుకు వచ్చాడంటే బ్యాట్సమన్లు బంతి వికెట్లకంటే తమ పాదాలు తగులకుండా కాపాడుకునేవాళ్లే ఎక్కువ అని చెప్పవచ్చు. 2001 జూన్ 17 న పాకిస్థాన్ , ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచులో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.  దీంతో కెప్టెన్ వకార్ యూనిస్ రెచ్చిపోయి ఇంగ్లాండ్ బ్యాట్సమన్లకు ముచ్చెమటలు పట్టించి కేవలం 156 పరుగులకే మట్టి కరిపించారు. ఇందులో వకార్ యూనిస్ 10 ఓవర్లలో 36 పరుగులకే 7 వికెట్లు తీసాడు. దీంతో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  
  

8. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) 7/34


ట్రెంట్ బౌల్ట్ ప్రస్తుత తరంలో న్యూజిలాండ్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న బెస్ట్ ఫాస్ట్ బౌలర్. న్యూజిలాండ్ బలమైన జట్టుగా మారడంలో బౌల్ట్ పాత్ర ఎంతో ఉన్నతమైనది. అయితే 2017 డిసెంబర్ 23 న న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్ మధ్య జరిగిన వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్కు వర్కర్, టేలర్, నికోలస్ అర్ధ సెంచరీలు చేయడంతో 325 పరుగులు చేసింది. దీంతో 326 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్ట్ ఇండీస్ బ్యాట్సమన్లు బౌల్ట్ దెబ్బకు ఏమాత్రం పోటీకూడా ఇవ్వలేక చేతులెత్తేసి కేవలం 121 పరుగులకే కుప్పకూలి 204 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఇందులో 10 ఓవర్లు వేసిన బౌల్ట్ 3 మేడీన్లతో 34 పరుగులు ఇచ్చి 7 వికెట్లు నేలకూల్చాడు.                                                                                                                                                    

7. టిమ్ సౌథీ(న్యూజిలాండ్) 7/33


టిమ్ సౌథీ గత దశాబ్దంగా న్యూజిలాండ్ జట్టులో తన స్వింగ్ బౌలింగుతోను, లేట్ హిట్టింగ్తోను కీలక ఆటగాడిగా తనదైన పాత్ర పోషిస్తూ జట్టు విజయాలకు పాటుపడుతున్న ఆటగాడు. ఇతడు 2015 క్రికెట్ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్సమన్లను ఏమాత్రం నిలదొక్కుకోనివ్వకుండా 33.2 ఓవర్లలోనే 123 పరుగులకు కుప్పకూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఇతడి ఖాతాలో ఇయాన్ బెల్, మూయిన్ అలీ, జొస్ బట్లర్ లాంటి మంచి ఆటగాళ్లు వున్నారు. ఈ మ్యాచులో 9 ఓవర్లు వేసిన సౌథీ 33 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన సౌథీకు మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.       

6. ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక) 7/30


ముత్తయ్య మురళీధరన్ ఈ పట్టికలో ఉండడం అనేది ప్రతి ఒక్కరు ఊహించిన విషయమే. మురళీధరన్ తన బౌలింగుతో అంతర్జాతీయ క్రికెట్లో ఎటువంటి సాధనలు చేసాడన్నది మనకు తెలిసిన విషయమే. 2000 వ సంవత్సరంలో  శ్రీలంక, ఇండియా మధ్య  జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఆటపట్టు, జయవర్దనే సెంచరీలు చేయడంతో 294 పరుగులు చేసింది. 295 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బలమైన బ్యాటింగ్ లైనప్ వున్న ఇండియా మురళీధరన్ దెబ్బకు 226 పరుగులకే చాపచుట్టేసింది. మురళీధరన్ 10 ఓవర్లు వేసి ఒక మేడిన్తో 30 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు నేలకూల్చాడు. సాధారణంగా బౌలింగులో బెస్ట్ ఫిగర్స్ అనేవి  బలహీనమైన జట్టుమీద తీయడం జరుగుతూ ఉంటుంది. కానీ మురళీధరన్ బలమైన ఇండియామీద తీయడంతో తాను గొప్ప బౌలర్ నని మరోసారి నిరూపించుకున్నాడు.         

5. ఆండీ బిచెల్(ఆస్ట్రేలియా) 7/20


ఆండీ బిచెల్ ఆస్ట్రేలియా తరుపున అంతలోనే మెరిసి మాయమైన ఆటగాడు. ఇతడు 2003 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2003 వరల్డ్ కప్ లో తమ చిరకాల ప్రత్యర్థి అయిన ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు ఆరంభం నుంచే ఆటంకంగా మారి దిగ్గజ క్రికెటర్లనుసైతం తన ఫాస్ట్ బౌలింగుతో ముచ్చెమటలు పట్టించి ఏకంగా 7 వికెట్లను పడగొట్టాడు. బిచెల్ తాను వేసిన 10 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 7 విలువైన వికెట్లను నేలకూల్చాడు. దీంతో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించడంతో మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
     

4. రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) 7/18


రషీద్ ఖాన్ ఆఫ్ఘానిస్తాన్ యువ సంచలనం. ప్రస్తుత తరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్పిన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ముందువరుసలో ఉంటాడు. తన పదునైన గూగ్లీ బంతులు సంధిస్తూ బ్యాట్సమన్లను ఇరుకున పడేసి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. 2017 వ సంవత్సరం వెస్ట్ ఇండీస్ తో జరిగిన ఒక వన్డేలో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ కు జావేద్ అహ్మది 81 పరుగులు చేయగా ఆఫ్ఘానిస్తాన్ 212 పరుగులు చేసింది. అయితే అరివీర భయంకరమైన వెస్ట్ ఇండీస్ బ్యాట్సమన్లముందు 213 పరుగుల లక్ష్యం తక్కువే అని చెప్పవచ్చు. అయితే బ్యాటింగ్కు వచ్చిన వెస్ట్ ఇండీస్ బ్యాట్సమన్లను రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో 8.4 ఓవర్లలోనే ఒక మేడిన్ ఓవర్తో 18 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. దాంతో వెస్ట్ ఇండీస్ కేవలం 149 పరుగులకే కుప్పకూలడంతో ఆఫ్ఘనిస్తాన్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది.         


3. గ్లెన్ మెక్‌గ్రాత్(ఆస్ట్రేలియా) 7/15


ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్న సమయంలో వారి జట్టుకు  గ్లెన్  మెక్‌గ్రాత్ బౌలింగులో వెన్నెముకగా నిలిచి ఆస్ట్రేలియా నంబర్ వన్ గా నిలవడంతో కీలకపాత్ర పోషించాడు. 2003 వ సంవత్సరం వరల్డ్ కప్లో  నమీబియాతో జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన తిరుగులేని ఆసీస్ 301 పరుగులు చేసింది. నమీబియా 302 పరుగులు ఛేదించే క్రమంలో గ్లెన్ మెక్‌గ్రాత్ 7 వికెట్లతో బ్యాట్సమన్ల నడ్డి విరచడంతో కేవలం 45 పరుగులకే చాప చుట్టేసింది. నమీబియా బ్యాట్సమన్లలో ముగ్గురు డకౌట్లు కాగా కెప్టెన్ కోట్జే మాత్రమే కేవలం 10 పరుగులతో ఎక్కువ పరుగులు చేసినవాడుగా నిలిచాడు. ఈ మ్యాచులో మెక్‌గ్రాత్ వేసిన 7 ఓవర్లలో నాలుగు మేడిన్లతో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 7 విలువైన వికెట్లు పడగొట్టాడు. ఇది వన్డేలలో  ఆస్ట్రేలియా తరుపున అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అలాగే వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడవ అత్యున్నతమైనదిగా నిలిచింది.          

2. షాహిద్ అఫ్రిది(పాకిస్థాన్), 7/12


షాహిద్ అఫ్రిది వన్డేలలో బెస్ట్ ఆల్ రౌండర్లలో ఒకడు. ఇతడు వేసే లెగ్ స్పిన్ బౌలింగుతో ఎంతో మంది బ్యాట్సమన్లను పెవిలియన్ బాట పట్టించాడు. 2013 జులై 14 న వెస్ట్ ఇండీస్, పాకిస్థాన్ కు జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కు ఆఫ్రిది 55 బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సులతో 76 పరుగులు చేయడంతో 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. 225 పరుగులు చేధించే క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్ట్ ఇండీస్ బ్యాట్సమన్లకు చుక్కలు చూపించి షాహిద్ ఆఫ్రిది ఏ ఒక్క బ్యాట్సమన్ ను నిలదొక్కుకోనివ్వకుండా చేసి 7 వికెట్లు పడగొట్టి తన బౌలింగ్ సామర్థ్యం ఏంటో మరోసారి చూపించాడు. అఫ్రిది తను వేసిన 9 ఓవర్లలో 3 మేడిన్లు చేసి, కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి వెస్ట్ ఇండీస్ జట్టు కేవలం 98 పరుగులకే కుప్పకూలడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ బౌలింగ్ వన్డేలలోనే పాకిస్థాన్ తరుపున బెస్ట్ బౌలింగ్ గణాంకాలుగాను వన్డేలలో రెండవ బెస్ట్ బౌలింగ్ ఫిగర్ గా నిలిచింది.       

1. చమిందా వాస్(శ్రీలంక), 8/19


చమిందా వాస్ శ్రీలంక తరుపున ఆడిన గొప్ప ఫాస్ట్ బౌలర్. ఇతడు వేసే పేస్, స్వింగ్ బంతులతో ఎన్నోమార్లు  ఒంటిచేత్తో తమ జట్టుకు విజయాలు అందించాడు. 2001 డిసెంబర్ 8 వ తేదీన జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ తన కెరీర్లోనే ప్రత్యేకమైనది. తాను వేసిన మొదటి బంతినుంచే వికెట్ పడగొడుతూ ఈ మ్యాచులో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి వన్డే క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసాడు. తను వేసిన 8 ఓవర్లలో గ్రాంట్ ఫ్లవర్, ఆండ్రూ ఫ్లవర్ లాంటి మేటి ఆటగాళ్లను అవుట్ చేసి 3 మేడిన్లతో  19 పరుగులు మాత్రమే ఇచ్చి మొదటి 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే బ్యాట్సమన్లలో 5 మంది సున్నా పరుగులకే అవుట్ అవ్వడంతో 15.4 ఓవర్లలోనే 38 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి వన్డేలలోనే నాల్గవ అత్యల్ప పరుగులు చేసారు. వాస్ ధాటికి  కెప్టెన్ కార్లిస్లే మినహాయించి ఏ ఒక్కరు రెండు అంకెల పరుగులు  చేయలేకపోయారు. ఈ రికార్డు తన పేరట నిలుపుకుని దాదాపు 19 సంవత్సరాలైనప్పటికీ ఏ ఒక్కరు దాని దరిదాపుల్లోకి రాలేకపొయ్యారు. 

ధన్యవాదాలు 
కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. 

Post a Comment

0 Comments